డిసెంబర్‌లో తప్పింది కానీ.. జనవరిలో తప్పదు..!?

సోమవారం, 27 డిశెంబరు 2010 (13:00 IST)
కొన్ని రకాల ఆహార ఉత్పత్తుల ధలరకు రెక్కలు రావడంతో రెండంకెల స్థాయికి చేరిన ఆహార ద్రవ్యోల్బణాన్ని కిందకు దింపేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) రానున్న జనవరిలో జరగబోయే మధ్యంతర ద్రవ్యపరపతి సమీక్షలో కీలక వడ్డీ రేట్లను మరోసారి పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

వాస్తవానికి ఈ డిసెంబర్ నెలలోనే వడ్డీ రేట్లను పెంచాల్సి ఉంది. కానీ సెప్టెంబర్ నెల గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో ఈసారికి వడ్డింపు ప్రక్రియను వాయిదా వేసుకుంది. కానీ డిసెంబర్ నెలలో ఉల్లి ధరలతో పాటు కూరగాయల ధరలు కూడా కొండెక్కడంతో జనవరి 25న జరగబోయే ద్రవ్యపరపతి సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచి ద్రవ్యలభ్యతను కఠినతరం చేసే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి మరోసారి ఆర్‌బీఐ ద్రవ్యపరపతిని కఠినతరం చేసే అవకాశం ఉందని డెలాయిట్టీ ఆర్థికవేత్త శాంతో ఘోష్ అన్నారు. జనవరిలో రెపో, రివర్స్ రెపో రేట్లను మరో 25 బేసిస్ (0.25 శాతం) మేర ఆర్‌బీఐ పెంచే అవకాశం ఉందని ఆయన అన్నారు. డిసెంబర్ 11తో ముగిసిన వారాంతంలో ద్రవ్యోల్బణం 12.13 శాతంగా నమోదై రెండంకెల స్థాయికి చేరిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి