ధరల నియంత్రణకు మార్గదర్శకాలను ప్రకటించిన కేంద్రం

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ధరలను అదుపుచేసేందుకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది. ఇటీవల ధరల పెరుగుదలను అరికట్టే అంశంపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రత్యేకంగా దృష్టిసారించిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, కొన్ని సమిష్టి నిర్ణయాలు, మార్గదర్శకాలను ప్రకటిస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించి, వాటిని శుక్రవారం విడుదల చేసింది. వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలు.

కేజీ ఉల్లిపాయలను రూ.35కే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, అపెక్స్ ఫెడరేషన్ ఆఫ్ కన్సూమర్ కో ఆపరేటివ్స్, ఎన్‌సిసిఎఫ్‌ల ద్వారా విక్రయించాలి. బ్లాక్‌మార్కెట్, అక్రమ నిల్వదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. రెగ్యులర్‌గా నిత్యావసర వస్తువు ఎగుమతి, దిగుమతులపై సమీక్ష నిర్వహించాలి.

ఎడిబుల్ ఆయిల్, పప్పుధాన్యాలు ప్రభుత్వం మార్కెటింగ్ సంస్థలు కొనుగోలు చేసి వాటిని రీటైల్ నెట్‌వర్క్ ద్వారా పంపిణీ చేయాలి. ప్రస్తుతం వీటిపై కొనసాగుతున్న రాయితీలను యధావిధిగా కొనసాగించాలి. నాన్ బాస్మతీ బియ్యంతో అన్ని రకాల నూనెలపై నిషేధం కొనసాగించాలి. ప్రతి రాష్ట్రంలో ఉన్న ధరలపై కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీ ఆఫ్ సెక్రటరీస్ కమిటీ సమీక్ష చేయాలి.

వెబ్దునియా పై చదవండి