మాజీ ముఖ్యమంత్రి జనార్థన రెడ్డిపై హత్యాయత్నం

శుక్రవారం, 7 సెప్టెంబరు 2007 (11:45 IST)
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు నేదరుమల్లి జనార్థన రెడ్డి దంపతులపై శుక్రవారం ఉదయం హత్యాయత్నం జరిగింది. ఆయన సొంత జిల్లా నెల్లూరులోని కోట గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఓ కల్వర్టర్ దాటుతుండగా మందుపాతర పేలింది. ఈ పేలుడులో కారు డ్రైవర్‌తో సహా ఇద్దరు కార్యకర్తలు ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు.

శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం నేదరుమల్లి జనార్థన రెడ్డికి గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. దాన్ని స్వీకరించేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి, భార్య నేదురుమల్లి రాజ్యలక్ష్మితో కలసి జానార్థన రెడ్డి తిరుపతికి బయలుదేరారు. వారి కాన్వాయ్‌ వెంట సుమారు 20 కార్లు ఉండగా, ముందు వరుస నుంచి మూడో వాహనంలో నేదరుమల్లి దంపతులు ఉన్నారు. ఐదో కారు రాగానే కల్వర్టర్ కింది భాగంలో ఉంచిన మందుపాతర పెద్ద శబ్దంతో పేలింది.

దీంతో మాజీ ముఖ్యమంత్రి దంపతులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ పేలుడు ధాటికి ఐదో కారు తునాతునకలైంది. ఈ పేలుడుకు పాల్పడింది మావోయిస్టులై ఉంటారని భావిస్తున్నారు. జనార్థన రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపిన విషయం తెల్సిందే. మాజీ ముఖ్యమంత్రి దంపతులపై పేలుడు జరగడాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో పాటు.. హోం మంత్రి జానా రెడ్డి తీవ్రంగా ఖండించారు.

వెబ్దునియా పై చదవండి