మళ్లీ కాంగ్రెస్‌కే పట్టం : వైఎస్ ధీమా

ఇందిరాగాంధీ 1978వ సంవత్సరంలో ఏ విధంగా ఘన విజయం సాధించారో.. అదే విధంగా రాబోయే సాధారణ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీకే ప్రజలు మళ్లీ పట్టం కడుతారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

విశాఖపట్నంలో సోమవారం వైఎస్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే పాపం చుట్టుకుంటుందన్న అభిప్రాయంతో ప్రజలు ఉన్నారని, ఇలాంటి పాటిజివ్ ఓట్లతోనే తమపార్టీ తిరిగీ అధికారంలోకి వస్తుందని తేల్చిచెప్పారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో జరిగినంత అభివృద్ధి, మరే పార్టీ పాలనలోనూ జరగలేదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. సమస్యలను తీర్చగల సత్తా, హామీలను నెరవేర్చగల నేర్పరితనం తమ పార్టీకి మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి తాము అనేక రకాలుగా మేలే చేసామని వైఎస్సార్ తెలిపారు.

ఇదిలా ఉంటే... ముఖ్యమంత్రి ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మద్దిపాడు వద్ద 592.18 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కందుల ఓబుల్‌రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్‌ను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. కాగా, వచ్చే మార్చి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి లక్ష్యం 80 వేల ఎకరాలకు సాగునీరు అందించనుంది.

వెబ్దునియా పై చదవండి