గాలింపు చర్యల్లో ఇస్రో, అమెరికా ఉపగ్రహాలు: సీఎస్

బుధవారం, 2 సెప్టెంబరు 2009 (19:58 IST)
ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఆచూకీ తెలుసుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన విమానాలతో పాటు.. అమెరికా ఉపగ్రహాల సాయం తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి వెల్లడించారు. నల్లమల అడవుల్లో వాతావరణం అనుకూలించనందున.. తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ.. ఫోటోలను తీసే ఇస్రోకు చెందిన విమానాన్ని గాలింపు చర్యలకు పంపినట్టు సీఎస్ తెలిపారు.

దీనిపై ఆయన బుధవారం రాత్రి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ ఆచూకీ రాత్రి 7 గంటల వరకు తెలియరాలేదన్నారు. వాతావరణం ఏమాత్రం అనుకూలించడం లేదన్నారు. రాష్ట్రానికి చెందిన గ్రేహౌండ్స్ దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయన్నారు. హెలికాఫ్టర్లు, చెంచు బృందాలను సైతం గాలింపు చర్యలకు ఉపయోగిస్తున్నట్టు తెలిపారు.

ముఖ్యంగా.. 250 చదరవు మీటర్ల ఎత్తులో పయనించగల సామర్ధ్యం ఉన్న విమానాలు కూడా గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయన్నారు. ముఖ్యమంత్రి ఆచూకీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నదీ గాలించేందుకు కేంద్రం సహాయం కోరినట్లు చెప్పారు. నల్లమల అటవీ ప్రాంతంలో దక్షిణ ప్రాంత సైన్యం రంగంలోకి దిగిందన్నారు. వీలైనంత త్వరగానే ముఖ్యమంత్రి ఆచూకీని కనిపెడతామని రమాకాంత్‌ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి