కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీకి రాజకీయ అగ్నిపరీక్ష ఇపుడు ఎదురైంది. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శించి, పార్టీని విజయపథంలో రాహుల్ నడిపి తనలోని రాజకీయ కోణాన్ని ఆవిష్కరించారు. అయితే, హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుని ఎంపికలో ఆయన మరోమారు పాత్ర పోషించాల్సి వుంది.
పార్టీలోనూ, కేంద్ర మంత్రివర్గంలోనూ యువతరానికి పెద్దపీట వేసేలా కృషి చేశారు. ఈ పరిస్థితుల్లో వైఎస్ వారసుడిని ఎంపిక రాహుల్‌కు ఓ పరీక్షలాంటిందే. రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే వైఎస్ తనయుడు జగన్‌కు పట్టం కట్టాలని సోనియాకు ఫ్యాక్స్ ద్వారా తమ సందేశాన్ని పంపుతున్నారు. అయితే, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్ని రకాల ఒత్తిడి తెచ్చినప్పటికీ... రాహుల్ గాంధీ సూచించే వ్యక్తికే ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఈ అంశంపై వారం రోజుల సంతాప దినాలు పూర్తయ్యాక కొత్త సీఎం అంశంపై చర్చించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. అయితే, అంతర్గతంగా మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై భారీగానే కరసత్తు చేస్తున్నారు. దీంతో వైఎస్ వారసుడి గురించి కొత్త కొత్త డిమాండ్లు రాసాగాయి. ఆరు నూరైనా యువ నాయకత్వానికే పగ్గాలు అప్పగించాలని కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు బాహాటంగానే తమ గళం విప్పారు.
సోనియా గాంధీ ఇప్పటికే ఈ విషయమై తనయుడు రాహుల్‌తో మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో సమీకరణాలు బహు క్లిష్టంగా ఉంటాయన్న విషయం సోనియాకు, రాహుల్‌కి కూడా తెలుసు. అందుకే వీలైనంత వరకు వైఎస్ అనుకూల వర్గీయుడికే ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని వైఎస్ సన్నిహితులు భావిస్తున్నారు. రాహుల్ మాత్రం యువనేతనే ఎంపిక చేస్తారన్న ఆశ చాలా మందిలో ఉంది.
ముఖ్యంగా యువ ఎమ్మెల్యేలు ఈ వాదనను బల పరుస్తున్నారు. దీనికి సంబంధించి అహ్మద్ పటేల్ ఎప్పటికప్పుడు రాష్ట్ర రాజకీయ పరిణామాలను బేరీజు వేస్తూ రాహుల్‌కి చేరవేస్తున్నారు. ఏమైనా కొత్త వారసుడి ఎంపికకు ఇంకా వారం పది రోజులు పట్టవచ్చని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలావుండగా, గురువారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమైన రాష్ట్ర కేబినెట్ సీఎల్పీ నేతగా వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ఎంపిక చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించడం కొసమెరుపు.