కేసీఆర్-సోనియాల మధ్య లోపాయికారి ఒప్పందం!

శుక్రవారం, 11 డిశెంబరు 2009 (11:41 IST)
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీల మధ్య లోపాయికారి ఒప్పందం ఒకటి కుదిరినట్టు ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే ఆమె ఏకపక్షంగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు వారు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే.. తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్‌లో విలీనం చేయడమే ఈ ఒప్పంద రహస్యమని వారు అంటున్నారు.

ఇందుకోసం తెరాస నేతలు కేంద్ర స్థాయిలో భారీగానే రాయబారం నిర్వహించినట్టు వినికిడి. అంతేకాకుండా, కేసీఆర్ జీరో కాకుండా చూసేందుకు భారీ స్థాయిలోనే కాంగ్రెస్ అధిష్టానానికి ముడుపులు అందించినట్టు ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. సోనియా పుట్టిన రోజైన తొమ్మిదో తేదీనే జన్మదిన కానుకగా ఈ ముడుపులు అందించినట్టు వారు ఆరోపిస్తున్నారు.

ఫలితంగా ఆ రోజు అర్థరాత్రి హోంమంత్రి చిదంబరంతో ఏకవాక్య ప్రకటన చేయించారని వారు దుమ్మెత్తి పోస్తున్నారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా ఇదే తరహాలా ఢిల్లీ వీధుల్లో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి, ప్రతిఫలం అనుభవించారన్నారు. ఇదే పరిస్థితి సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్‌కు రాష్ట్ర ప్రజలు బుద్ధిచెప్పే రోజులు ఆసన్నమయ్యాయని వారు జోస్యం చెపుతున్నారు.

అంతేకాకుండా, రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కేంద్ర మంత్రులు చిదంబరం (తమిళనాడు), వీరప్ప మొయిలీ (కర్ణాటక)లు తమ వంతు పాత్ర పోషించినట్టు వినికిడి. దక్షిణ భారతదేశంలో అతిపద్ద రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయడం వల్ల భవిష్యత్‌తో తమ రాష్ట్రాలు చక్రం తిప్పేలా వారు పావులు కదిపి, హై కమాండ్‌కు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు రాజకీయ వర్గాల కథనాలు.

వీటన్నింటిని రుజువు చేసేలా సోనియా పుట్టిన రోజున హస్తినలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు అపాయింట్ ముఖ్యమంత్రి రోశయ్య కోరగా, ఆమె తిరస్కరించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఢిల్లీకి రమ్మని కబురు పంపారు. అనంతరం చిదంబరం ఒక ప్రకటన తయారు చేసి, దాన్ని రోశయ్యకు చూపించారు. దీనికి తలాడించి హైదరాబాద్ విమానమెక్కి రోశయ్యకు శంషాబాద్‌లో దిగగానే జరిగిన అన్యాయంతో ఖంగుతిన్నారు.

తనకు చూపిన ప్రకటన కాకుండా మరో ప్రకటనను చిదంబరం చదివి వినిపించారని ముఖ్యమంత్రే స్వయంగా తన మంత్రివర్గ సహచరులతో తన గోడు వెళ్లబోసుకున్నట్టు సమాచారం. ఇదంతా.. కేసీఆర్, సోనియాల మధ్య ముందస్తుగా కుదిరిన లోపాయకారి ఒప్పంద ప్రభావమని వారు ఆరోపిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి