సానుకూలం నిర్ణయం రాకపోతే ఆమ"రణం": వైఎస్.వివేకా

శుక్రవారం, 11 డిశెంబరు 2009 (14:31 IST)
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోక పోతే ఆమరణ నిరాహారదీక్ష చేయనున్నట్టు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సోదరుడు, ఎమ్మెల్సీ వైఎస్.వివేకానంద ప్రకటించారు. ఈ విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఆయన ఆరోగ్యం దృష్ట్యా అనుచరులు వివేకానందకు వారిస్తున్నారు.

కానీ ఆయన మాత్రం తన పట్టు వీడటం లేదు. తన సోదురుని బలమైన ఆకాంక్షల్లో ఒకటైన సమైక్యాంధ్రకు తామంతా కట్టుబడి ఉంటామన్నారు. అపుడే పరలోకంలో ఉన్న వైఎస్సార్ ఆత్మశాంతిస్తుందని వివేకానంద అభిప్రాయపడ్డారు.

ఇదిలావుండగా, కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం పార్టీలకతీతంగా చేపట్టిన రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో బంద్ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. అనంతపురంలో ఇది మరింత ఉధృతంగా సాగుతోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా అనంతపురం కార్పొరేషన్ కౌన్సిల్‌ మేయర్‌తో పాటు కార్పొరేటర్లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు.

కడప జిల్లా ప్రధాన కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పు అంటించారు. తిరుపతి సంపూర్ణ బంద్ సాగుతోంది. శ్రీకాళహస్తిలో ఆర్టీసీ బస్సుకు నిప్పంటించారు. విజయవాడ బెంజ్ సర్కిల్‌లో తెదేపా, కాంగ్రెస్, ప్రరాపాలతో పాటు.. అన్ని పార్టీల నేతలు బంద్ పాటిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి