ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటిస్తే తాము చేపట్టిన ఈ ఉద్యమం మరింత ఉధృతంగా సాగుతుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. ఆయన సున్నిత మనస్కుడని, అఖిలాంధ్ర అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు.
అలాంటి వ్యక్తి సమైక్యాంధ్రకు నాయకత్వం వహించాలని ఆయన కోరారు. దీనిపై లగడపాటి పదేపదే మీడియాతో అన్నారు. దీంతో మేల్కొన్న ప్రరాపాకు చెందిన సీమాంధ్ర నేతలు చిరంజీవిపై ఒత్తిడి తేవడంతో మనస్సు మార్చుకున్నట్టు తెలుస్తోంది.
ఈ అంశంపై లగడపాటి మీడియాతో మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి చిరంజీవి నాయకత్వం వహించాలని కోరారు. ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రతి దీక్షా శిబిరానికి వెళ్లి తన సంఘీభావాన్ని ప్రకటించాలని కోరారు.
చిరంజీవి ప్రకటన చేసిన అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటిస్తారని లగడపాటి జోస్యం చెప్పారు. ఆ తర్వాత తెరాస, సీపీఐ, సీపీఎం, భాజపా, లోక్‌సత్తా.. ఇలా మిగిలిన పార్టీలు కూడా సమైక్య ఆంధ్ర కోసం తమ గొంతు వినిపించే రోజు మరెంతో దూరం లేదన్నారు.