మంత్రివర్గంలో చోటు దక్కించుకోనున్న టిజి వెంకటేష్‌

రాష్ట్రంలో జరుగనున్న మంత్రివర్గ విస్తరణలో భాగంగా కర్నూలు ఎమ్మెల్యే టిజి వెంకటేష్‌కు స్ధానం దక్కవచ్చన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. గత కొన్ని నెలలుగా మూలనపడిన మంత్రివర్గ విస్తరణ కసరత్తు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశలున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో కర్నూలు జిల్లానుంచి శిల్పామోహన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు మరో మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు పరిశీలకుల అంచనా. ఇందులో భాగంగానే రాయలసీమ జిల్లాల నుంచి జెసి దివాకర్‌ రెడ్డి, టిజి వెంకటేష్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే వెంకటేష్‌తో పాటు, సీనియర్‌ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పేరు కూడా వినిపిస్తుండటం గమనార్హం.

ముఖ్యమంత్రి రోశయ్యతో ఎమ్మెల్యే టిజి వెంకటేష్‌కున్న సన్నిహిత సంబంధాలు, బంధుత్వాల కారణంగా ఆయనకే మంత్రి పదవి దక్కే సూచనలున్నట్లు కొందరు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీ లభించినందునే ఎమ్మెల్యే వెంకటేష్ నింపాదిగా ఉన్నట్లు సమాచారం. కాగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కూడా తనదైన శైలిలో కాంగ్రెస్‌ పెద్దల సహకారంతో మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి