ఆ మూడు కారణాల వల్లే తెదేపాను వెలివేశాం: కోదండరామ్

శనివారం, 13 మార్చి 2010 (13:22 IST)
జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాజీనామాలు చేయక పోవడం, జేఏసీపై పదేపదే విమర్శలు చేయడం, తెలంగాణపై చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయక పోవడం వల్లే తెలంగాణ ఐకాస నుంచి ఆ పార్టీని బహిష్కరించినట్టు కన్వీనర్ ఆచార్య కోదండరామ్ వివరణ ఇచ్చారు. దీనిపై ఆయన శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తెదేపా వైఖరేమిటో ఇప్పటికైనా చెప్పాలని డిమాండ్ చేశారు.

మహాధర్నా సమయంలో తెలంగాణ న్యాయవాదులపై జరిగిన దాడికి ఆ పార్టీ ఎందుకు క్షమాపణ చెప్పలేదని ప్రశ్నించారు. అలాగే, చంద్రబాబు మహబూబ్ నగర్ జిల్లా పర్యటన సందర్భంగా జేఏసీ నేతలను ఎందుకు అరెస్టు చేశారని ఆయన ప్రశ్నించారు. ఈ మూడు ప్రశ్నలకు చంద్రబాబుతో సహా తెదేపా నేతలు సమాధానం చెప్పాలని కోదండరామ్ డిమాండ్ చేశారు.

అలాగే, తెదేపాను మాత్రమే జేఏసీ టార్గెట్ చేశారని తెదేపా నేతలు ఆరోపించడం సరికాదన్నారు. తెరాస అధినేత కేసీఆర్, మెదక్ ఎంపీ విజయశాంతిలు వ్యూహాత్మకంగా తమ రాజీనామాలను వాయిదా వేసుకున్నారే గానీ.. వారు రాజీనామా చేయమని ఎక్కడా చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ప్రతి తెలంగాణ నేత తమ పదవులను త్యజించాల్సిందేనన్నారు.

ముఖ్యంగా, ప్రధాన ప్రతిపక్షంగా తెదేపా తన వైఖరిని వెల్లడించి, ఉద్యమానికి మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. దీనికి విరుద్ధంగా తెదేపా నేతలు జేఏసీపై విమర్శలు చేయడం వల్లే ఆ పార్టీని బహిష్కరించినట్టు చెప్పారు. ఇకపోతే.. తెలంగాణ ఉద్యమం ప్రజా మద్దతుతో సాగుతోందన్నారు. ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా సాగుతున్న ప్రజాపోరాటంగా కోదండరామ్ అభివర్ణించారు.

వెబ్దునియా పై చదవండి