రాహు కేతువులు పోయారు.. జేఏసీ పునీతమైంది: తెరాస

తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి రాహు (కాంగ్రెస్) కేతువు (తెదేపా)లు పోయారని, అందువల్ల ఐకాస పునీతమైందని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, కేసీఆర్ తనయుడు కె.తారకరామారావు అభిప్రాయపడ్డారు. జేఏసీ నుంచి తెలుగుదేశం పార్టీని బహిష్కరించడం పట్ల ఆయన స్పందనను శనివారం వ్యక్తం చేశారు.

ప్రధాన పార్టీలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు జేఏసీ నుంచి తప్పుకోవడం పట్ల తెలంగాణ ఉద్యమం మరింత బలపడుతుందన్నారు. 'వంట సిద్ధమైన తర్వాత గంటలు ఊపేందుకు' వచ్చిన ఈ రెండు పార్టీలు బయటకు వెళ్లడమే మంచిదన్నారు. దీనివల్ల ఐకాస పునీతం కావడమే కాకుండా, మరింతగా బలపడుతుందన్నారు.

ఇకపోతే.. కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ సంస్థగా ఐకాస మారిందని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్సే.. తెచ్చేది కాంగ్రెస్సేనని ఆయన జోస్యం చెప్పారు. అందువల్ల జేఏసీ ఉన్న లేకపోయినా ఒక్కటేనన్నారు. అంతేకాకుండా, జేఏసీని తాము ఆది నుంచి వ్యతిరేకిస్తున్నట్టు కోమటిరెడ్డి గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి