అర్థనగ్న "ఆట" తప్పు కాదా..?: తల్లిదండ్రులకు హెచ్ఆర్సీ ప్రశ్న
ఐపీఎల్ ఫైనల్ "ఆట" ముగిసింది. లలిత్ మోడీ క్లీన్ బౌల్డ్ అయిపోయి "ఔట్" అయ్యాడు. ఇప్పుడు రాష్ట్రంలోని రెండు ప్రైవేట్ టెలివిజన్ ఛానళ్ల మధ్య సరికొత్త "ఆట" మొదలైంది. ఆ మాటకొస్తే మిగిలిన ఛానళ్లు కూడా సమయం దొరికినప్పుడల్లా ఓ "ఆట" ఆడుకుంటున్నాయనుకోండి.
ఈ సంగతి ప్రక్కన పెడితే ప్రస్తుతం ఓ ప్రైవేటు ఛానల్ తన "ఆట" కార్యక్రమంలో పిల్లలచేత రకరకాల నృత్యాలను చేయిస్తోంది. ఈ నృత్యాల్లో కొంతమంది పిల్లలు కురుచ దుస్తులు వేసుకుని కూడా నాట్యం చేస్తున్నారు. టీవీలున్నవారందరూ బహుశాః ఈ కిడ్స్ "ఆట"ను చూస్తూ వుండేవుంటారు.
ఈ ఆటను మరో ప్రైవేటు టెలివిజన్ ఛానల్ బాగా లోతుగా విశ్లేషిస్తూ ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఆటలో పిల్లలకు కురుచ దుస్తులు వేసి నాట్యం చేయించడాన్ని సదరు కార్యక్రమంలో పాల్గొన్నవారు విమర్శించారు. అభం శుభం తెలియని పిల్లలను ఆట బొమ్మలుగా చూపిస్తూ అశ్లీలంతో కూడిన నృత్యాలను చేయించడం తప్పని వారు చెప్పారు.
దీనిపై ఆటలో నటించిన పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహావేశానికి గురయ్యారు. చిన్న పిల్లలకు ఏ డ్రెస్సులేసినా ముచ్చటగా ఉంటారనీ, దానిని అర్థనగ్నమంటారా...? అని సదరు ఛానల్‌పై మండిపడ్డారు. అంతేకాదు తమ పిల్లలు ఆటలో ఆడిన నృత్యాలను అశ్లీలమైన నృత్యాలంటూ విమర్శిస్తూ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన సదరు ప్రైవేటు ఛానల్‌పై ఫిర్యాదు చేసేందుకు మానవ హక్కుల సంఘం మెట్లక్కారు. ఇక్కడ వారికి చేదు అనుభవం ఎదురైంది. హెచ్ఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి పిల్లల తల్లిదండ్రులను ఎదురు ప్రశ్నలు వేశారు.
పిల్లలకు కురుచ దుస్తులు వేసి డ్యాన్స్ చేయించడం మంచిదని మీరనుకుంటున్నారా అని ప్రశ్నించారు. పిల్లలను సక్రమంగా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నదనీ, అటువంటిది అర్థనగ్న దుస్తులు వేసి జుగుప్సాకరమైన పాటలకు డ్యాన్సులు చేయించడం సరికాదన్నారు. పిల్లలను మంచిగా పెంచడానికే తల్లిదండ్రులకు హక్కు ఉన్నదన్నారు. దీంతో తల్లిదండ్రులు సమాధానం చెప్పలేక బిక్కమొహాలు వేశారు. ఊహించని విధంగా జస్టిస్ నుంచి ప్రశ్నల వర్షం రావడంతో వారు షాక్‌కు గురయ్యారు.
అన్ని రియాలిటీ షోలలోనూ ఇదే వ్యవహారం నడుస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయనీ, ఈ షోలపై విచారణకు కమిటీ వేస్తామని తెలిపారు. రియాలిటీ షోలలో అసభ్య సన్నివేశాలు ఉండకూడదనీ, ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. రియాలిటీ షోలపై తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తున్నట్లు మానవ హక్కుల కమిషన్ తెలిపింది.