ఉపఎన్నికల ప్రచారానికి తెర: పోలింగ్‌కు సర్వం సిద్ధం!

గత పక్షం రోజులుగా సాగిన ఉప ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రతో ముగిసింది. మరో 24 గంటల్లో పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఉప ఎన్నికలు జరుగుతున్న 12 అసెంబ్లీ స్థానాలకు గాను ఐదింటిలో బ్యాలెట్ విధానం ద్వారా పోలింగ్ జరుగనుంది. మిగిలిన ఏడింటిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా పోలింగ్ నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఉప ఎన్నికల ఛాంపియన్ ఎవరో తేలిపోయే తరుణం ఆసన్నమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధకులం తామేనంటూ తెలంగాణ రాష్ట్ర సమితి హోరాహోరీగా ప్రచారం చేసింది. తెలంగాణ తెచ్చేది మేమే.. ఇచ్చేది మేమేనంటూ కాంగ్రెస్ సరికొత్త పల్లవిని అందుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇస్తామంటే తాము అడ్డుపడబోమంటూ తెలుగు తమ్ముళ్లు (తెదేపా) తమ పంథాలో ప్రచారం చేశారు.

ఇలా.. మూడు ప్రధాన పార్టీలు తమతమ ప్రచారాస్త్రాలతో ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలను హోరెత్తించాయి. తెలంగాణవాదమే ఏకైక అజెండాగా సాగిన ఈ ప్రచారం ఆదివారం సాయంత్రం ఐదు గంటలతో తెరపడింది. ఫలితంగా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి వచ్చిన మంత్రులు, పార్టీల అధినేతలు, ఇతర నేతలూ తట్టాబుట్టా సర్దుకున్నారు. 27వ తేదీ ఏడు గంటల నుంచి ఉప ఎన్నికల పోలింగ్ ఆరంభమవుంది. ఇది సాయంత్రం ఐదు గంటల వరకు సాగనుంది.

వెబ్దునియా పై చదవండి