రాష్ట్రవ్యాప్తంగా ఎస్సై రాత పరీక్షలు వాయిదా: హోంమంత్రి

గత మూడు నాలుగు రోజులుగా ఎస్సై పరీక్షలపై హైదరాబాదులో చెలరేగిన ఆందోళనల దృష్ట్యా, ఆయా పార్టీలు, జేఏసీల విజ్ఞప్తి మేరకు ఎస్సై రాత పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

ఇన్ని ఉద్రిక్త పరిస్థితుల నడుమ పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలిపారు. రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితి నెలకొన్నప్పుడే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

14 (ఎఫ్) నిబంధనపై కేంద్ర హోంమంత్రితో ముఖ్యమంత్రి రోశయ్య మాట్లాడారన్నారు. సాధ్యమైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తామని కేంద్రమంత్రి చిదంబరం చెప్పారన్నారు.

ఎస్సై రాత పరీక్షలు వాయిదా వేయడం మూలంగా సుమారు 18వేల మంది అభ్యర్థులు నిరాశకు గురవుతారని, కానీ వాయిదా వేయమని అన్ని పార్టీలు, జేఏసీలు అడుగుతున్నాయి కనుక వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. గత రెండుమూడు రోజులుగా ప్రభుత్వం మొండివైఖరి ప్రదర్శిస్తోందనీ, భేషజాలకు పోతోందని కొన్ని పార్టీలు విమర్శించాయన్నారు.

కానీ నిరుద్యోగుల బాధను అర్థం చేసుకున్న దరిమిలా ప్రభుత్వం పరీక్షను నిర్వహించేందుకు మొగ్గు చూపిందని తెలిపారు. అయితే అందరూ వద్దని చెపుతున్నప్పుడు కొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సబిత వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి