చెప్పిన మాట వినడని ముద్ర వేసుకున్న దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుమారుడు, కడప ఎంపీ వై.ఎస్. జగన్‌పై హైకమాండ్ సీరియస్ అయ్యింది. సాక్షి టీవీ ఛానెల్‌లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా వచ్చిన కథనాలపై కాంగ్రెస్ అధిష్టానం తగిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో జగన్ వ్యవహారాన్ని పరిశీలిస్తున్న హైకమాండ్, ఆ కథనం పార్టీ పరువుకు భంగం కలిగించేవిగా ఉంటే ఏమి చర్య తీసుకోవాలని యోచిస్తోంది.
కానీ జగన్‌పై కాంగ్రెస్ అధిష్టానం తొందరపడి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించాలని భావిస్తోంది. పనిలో పనిగా సాక్షి కథనంపై నివేదిక పంపాల్సిందిగా పీసీసీకి హైకమాండ్ ఆదేశించింది. అధిష్టానం ఆదేశంతో పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఇప్పటికే నివేదిక పంపారు. కాగా.. హైకమాండ్ నివేదికను పరిశీలించి.. జగన్‌కు షోకాజ్ నోటీసు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే వై.ఎస్. జగన్మోహన రెడ్డి ప్రాంతీయ పార్టీకి ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చీలిక వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు.. సోనియాపై తప్పుడు ప్రచారం చేసిన సాక్షి కార్యాలయం ఎదుట యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్ బాబు ఆందోళనకు దిగారు. అయితే ఉద్రిక్తత చోటు చేసుకోకుండా పోలీసులు సురేష్ బాబు అరెస్టు చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సాక్షి పత్రికలను తగులబెడుతూ.. సాక్షికి వ్యతిరేకంగా నినాదాలు చేపడుతున్నారు.