సుప్రీంకోర్టు వ్యాఖ్యలు యూపీఏకు ఓ చెంపపెట్టు: బాబు
కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) నియామకంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కేంద్రంలోని యూపీఏ సర్కారుకు ఒక చెంపపెట్టులాంటివని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పీజీ.థామస్‌ను సీవీసీగా నియమించడాన్ని సుప్రీంకోర్టు కూడా ఖండించిందన్నారు.
ఇకపోతే... తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలో ప్రభుత్వ ఎన్జీవో సంఘాలు మంగళవారం చేపట్టిన ఆందోళనలను ప్రభుత్వం అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. సమస్యల పరిష్కరించి వేతనాలు పెంచాలంటూ ఛలో హైదరాబాద్ చేపట్టిన జేఏసీ నేతల శాంతియుత యాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు.
ప్రభుత్వం ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం గత ఆరేళ్లుగా నామమాత్రంగా నిర్వహిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వం సరైన విధంగా స్పందించక పోవడం వల్లే ఎన్జీవో సంఘాలు ఉద్యమ బాటను పట్టాల్సి వచ్చిందన్నారు.