జగన్ రాజీనామా కాంగ్రెస్‌కు నష్టమే: వెంకయ్య నాయుడు

కాంగ్రెస్ పార్టీకు వైస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయడం ఆ పార్టీకు పెద్ద ఎదురుదెబ్బ అని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాలపై జగన్ రాజీనామా ప్రభావం తప్పక ఉంటుందని ఆదివారం బంజారాహిల్స్ రోడ్ నెం.1 లో మాజీ మంత్రి ఉపేంద్ర విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఐక్యంగా వుంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 25 శాతం నిధులు విద్యా, వైద్యా రంగానికి కేటాయిస్తే ఈ అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.

ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకోవాలని ఆయన సూచించారు. 2జీ స్పెక్ట్రం కుంభకోణంపై కేంద్రం సంయుక్త పార్లమెంటరీ విచారణ(జెపిసి) జరిపే వరకూ పార్లమెంటును సజావుగా సాగమనివ్వమని, భావసారుప్యం గల పార్టీలు తమతో కలిసి వస్తే వారితో కలిసి కేంద్రం అవినీతిపై పోరాడటానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని, ప్రజా సమస్యలు, అవినీతిపై పోరాటానికి తమ పార్టీ ఎప్పుడు ముందుంటుందన్నని వెంకయ్య నాయుడు అన్నారు.

వెబ్దునియా పై చదవండి