నష్టాన్ని మైకులను విరగ్గొట్టిన వారి నుంచే వసూలు చేయాలి!!

బుధవారం, 15 డిశెంబరు 2010 (13:08 IST)
రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులు సృష్టించిన రగడపై ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష సభ్యులమనే విషయాన్ని కూడా వారు విస్మరించి ఈ సభలో రగడ సృష్టించడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా పేర్కొన్నారు.

బుధవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఆయన సభలో మాట్లాడుతూ.. తెదేపా సభ్యుల వ్యవహార శైలి తీవ్ర అసహనానికి గురి చేసిందన్నారు. ముఖ్యంగా, మైకులు విరగ్గొట్టి సభకు తీవ్ర నష్టం చేకూర్చారన్నారు. అందువల్ల ఈ నష్టాన్ని వారి నుంచే సేకరించాలని ఆయన డిమాండ్ చేశారు.

అంతేకాకుండా, ఇలాంటి చర్యలు భవిష్యత్‌లో పునరావృత్తం కాకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సభాపతికి విజ్ఞప్తి చేశారు. ఏ పార్టీ సభ్యుడైనా ఇలాంటి చర్యలకు పాల్పడినట్టయితే సహించరాదన్నారు.

వెబ్దునియా పై చదవండి