కేసీఆరూ.. నీ పత్రికకు ఆ పేరు పెట్టవద్దు..!: హైకోర్టు

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పత్రికకు నమస్తే తెలంగాణ అనే పేరును పెట్టకూడదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

మూడేళ్ల క్రితం 2007వ సంవత్సరంలో తాను నమస్తే తెలంగాణ పేరుకు దరఖాస్తు చేసుకున్నానంటూ డాక్టర్ గోకా శ్రీధర్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కేసీఆర్ తన పత్రికకు నమస్తే తెలంగాణ అనే పేరును వినియోగించరాదని పేర్కొంది.

ఇంకా డాక్టర్ గోకా శ్రీధర్ అనే వ్యక్తి తన పిటిషన్‌లో నమస్తే తెలంగాణ పేరును దరఖాస్తు చేసుకుంటే అధికారులు ఆ పేరును పరిశీలించిన అనంతరం అదే సంవత్సరం నవంబరు 30వ తేదిన ఆ పేరును ఇతరులకు కేటాయించామని చెప్పి దానిని తిరస్కరించినట్లు చెప్పారు.

అయితే ఈ సెప్టెంబరులో అదే పేరును దామోదర రావు అనే వ్యక్తికి కేటాయించారని ఇది చట్ట విరుద్దమని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. కాబట్టి ఈ కేటాయింపు చెల్లదని ప్రకటించి పరిహారం ఇప్పించేలా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టును కోరారు. విచారణ చేపట్టిన జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్ వాదప్రతివాదాలు విన్న అనంతరం నమస్తే తెలంగాణ పేరును నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి