తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదుగాక కాదు: జేసీ దివాకర్ రెడ్డి
గురువారం, 16 డిశెంబరు 2010 (10:31 IST)
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదుగాక కాదు అని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేసీ.దివాకర్ రెడ్డి నొక్కివక్కాణించారు. ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర సంచలనమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఒక నిశితంగా పరిశీలిస్తే కేంద్రం రాష్ట్రాన్ని విభజించేందుకు ఆసక్తిగా లేదన్నారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.
అయితే, తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటుకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సుముఖంగా ఉన్నట్టు కుండబద్ధలు కొట్టినట్టు చెపుతున్నారు. సోనియా, మన్మోహన్ సింగ్‌లతో పలువురు మాట్లాడుతుంటారు. వారు లోపల ఏం మాట్లాడుకున్నదీ ఎవరికీ తెలియదు. కానీ బయట మాత్రం మరోలా చెపుతుంటారు అని జేసీ వ్యాఖ్యానించారు.
అయితే, తాను ఇటీవల సోనియా గాంధీని కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరానని ఆయన తెలిపారు. అందుకు సోనియా ఏమన్నారని ప్రశ్నించగా, ‘ఓకే’ ఆల్‌రైట్ అని అన్నారని జేసీ క్లుప్తంగా సమాధానం ఇచ్చారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులానే ఉంటుందని భావిస్తున్నారా? అని ప్రశ్నించగా, ఊహించడం కష్టమని జేసీ అభిప్రాయపడ్డారు.