ఉప ఎన్నికల్లో గెలిస్తే నేనే ముఖ్యమంత్రిని: వైఎస్.వివేకా?
గురువారం, 16 డిశెంబరు 2010 (12:11 IST)
కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల్లో విజయం సాధిస్తే తాను ముఖ్యమంత్రిని అవుతానని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి తన అనుచరుల వద్ద అంటున్నట్టు తెలిసింది. అందువల్ల ఈ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి గెలుపుకోసం కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారని వారు చెపుతున్నారు.
కడప పార్లమెంట్ సభ్యత్వానికి వైఎస్.జగన్మోహన్ రెడ్డి, పులివెందుల అసెంబ్లీ సీటుకు ఆయన తల్లి, వైఎస్ సతీమణి వైఎస్.విజయలక్ష్మీ రాజీనామా చేసిన విషయం తెల్సిందే. దీంతో ఈ రెండు స్థానాలకు వచ్చే యేడాది ఫిబ్రవరిలో ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలావుండగా, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన జగన్.. మరో 45 రోజుల్లో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన పులివెందుల గడ్డపై నుంచే ప్రకటించారు. ఆ తర్వాత పులివెందులలో పర్యటించి స్థానిక నేతలతో భేటీ అయ్యారు.
ఈ నేపథ్యంలో.. కడపలో జగన్ ప్రభంజనానికి చెక్ పట్టేందుకు వీలుగా వైఎస్.వివేకానందను కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దింపింది. అధినాయకత్వం ఆదేశాల మేరకు కడపలో మకాం వేసిన వివేకానంద తన అనుచరులు, కీలక నేతలతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో జగన్‌ను, ఆమె తల్లిని ఎలాగైనా ఓడించాలని ఆయన అనుచరులకు పిలుపునిచ్చినట్టు సమాచారం.
రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధింస్తే అధిష్టానం వద్ద పలుకుబడి పెరగడమే కాకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో తాను కూర్చొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఇది కడప జిల్లాకు కూడా ఎంతగానో దోహదపడుతుందని వైఎస్.వివేకా చెపుతున్నట్టు వినికిడి. ఇదే అంశంపై మండలాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహించాలని ఆయన కీలక నేతలకు ఆదేశాలు జారీ చేశారు. మొడికి రాని నేతల వ్యవహారాన్ని తనకు వదిలే వేయాలని కూడా ఆయన చెప్పినట్టు సమాచారం.