ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులు.. ఆ రెండు ఫ్యామిలీ సభ్యులేనా?

గురువారం, 16 డిశెంబరు 2010 (12:22 IST)
కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల సమరంపై ఇప్పటి నుంచే సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన దివంగ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఉప ఎన్నికల బరిలో సొంత పార్టీపైనే పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.

దీంతో ఈ ఉప ఎన్నికల సమరం ఆత్యంత ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ తరపున జగన్ బాబాయ్, వైఎస్.సోదరుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఈయన ఎమ్మెల్సీ పదవీకాలం మార్చి నెలతో ముగియనుంది. అందువల్ల ఆయన పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు.

దీనికి అధిష్టానం కూడా ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో వైఎస్.వివేకా ఇప్పటి నుంచి ఉప ఎన్నికల వ్యూహ ప్రణాళికను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే, కడప పార్లమెంట్ స్థానం నుంచి ఆయన కుమార్తెను బరిలోకి దించాలని భావిస్తున్నారు.

ఎందుకంటే.. పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి జగన్ బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. కడప ఎంపీ స్థానం నుంచి వైఎస్.కుమార్తె షర్మిలతో నామినేషన్ దాఖలు చేయించవచ్చు. ఒకవేళ జగన్ పార్లమెంట్‌కు వెళ్లాలని భావిస్తే.. తన తల్లి విజయలక్ష్మిని తిరిగి పులివెందుల స్థానం నుంచి బరిలోకి దించవచ్చు. జగన్ పార్టీ అభ్యర్థుల వ్యవహారంలో ఎలా ఉన్నప్పటికీ.. వైఎస్.వివేకా మాత్రం ఖచ్చితంగా పులివెందుల స్థానం నుంచి పోటీ చేయడం ఖాయంగా తెలుస్తోంది.

అంతేకాకుండా జగన్ లోక్‌సభకు పోటీ చేస్తే ఆయనపై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి డీఎల్.రవీంధ్రా రెడ్డి స్వయంగా ప్రకటించారు. దీనికి అధిష్టానం సమ్మతిస్తే మాత్రం ఖచ్చితంగా డీఎల్ బరిలో నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏది ఏమైనా.. జగన్‌ను ఓడించడమే ధ్యేయంగా వైఎస్, డీఎల్‌లు పావులు కదుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి