నేటి నుంచి బాబు దీక్ష: వేదిక న్యూఎమ్మెల్యే క్వార్టర్స్!!

శుక్రవారం, 17 డిశెంబరు 2010 (11:00 IST)
రాష్ట్రంలో నెలకొన్న రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ కదంతొక్కింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుంచి నిరవధిక నిరాహారదీక్షకు దిగనున్నారు. ఆయనకు సంఘీభావంగా ఆ పార్టీ శ్రేణులు ఆయా జిల్లాల్లో ఈ దీక్షలు చేస్తారు. ఇందుకోసం ఆయన శుక్రవారం ఉదయం తన ఇంటి నుంచి బయలుదేరి ఎన్టీఆర్‌ ఘాట్‌కు చేరుకుని పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్‌ సమాధికి నివాళులు అర్పించారు.

ఆ తర్వాత ఆయన తన దీక్షా శిబిరమైన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆయన దీక్షకు కూర్చోనున్నారు. అంతకుముందు రైతు సమస్యలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సానుకూలంగా స్పందిస్తారో లేదో, ఆరోగ్యం సహకరిస్తుందో లేదో చూసుకుని దీక్షకు దిగాలని పార్టీ సీనియర్ నేతలు బాబుకు సూచించారు. అయితే, దీన్ని చంద్రబాబు సున్నితంగా తిరస్కరించి దీక్ష చేసేందుకే మొగ్గు చూపారు.

ఆ ప్రకారంగా సచివాలయం సమీపంలో ఉన్న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో చంద్రబాబు సహా పలువురు సీనియర్‌ నేతలు ఉదయం 10.30 గంటలకు నిరవధిక నిరహార దీక్ష చేపడతారన్నారు. మిగిలిన నేతలు రోజుకు కొందరు చొప్పున దశల వారీగా దీక్షలో చేరుతారన్నారు. చంద్రబాబుకు సంఘీభావంగా జిల్లాల్లోనూ పార్టీ శ్రేణులు నిరవధిక నిరాహార దీక్షలకు కూర్చుంటారని పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి