పత్రిక, ఛానల్ ఉన్నాయి కదా అని బెదిరిస్తే బెదరం: బొత్స

చేతిలో పత్రిక, ఛానళ్లు ఉన్నాయి కదా అని బెదిరిస్తే బెదిరే ప్రభుత్వం తమది కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జీవించి ఉన్నప్పుడు కూడా ఏవో రెండు పత్రికలు బెదిరిస్తే బెదరమని ఏనాడో చెప్పారన్నారు.

రాష్ట్ర పరిస్థితులను, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా చేతికి వచ్చిన రాతలు, తోచిందే ఛానల్ లో ప్రసారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్ తీసుకున్న నిర్ణయాలన్నీ ఆయన ఒక్కరే తీసుకున్నవి కావనీ, ప్రభుత్వంలో భాగస్వాములంగా ఉన్న తామంతా కలిసి ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాలని గుర్తుపెట్టుకోవాలన్నారు.

తాను శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై ఓ ఛానల్ పనిగట్టుకుని నిన్నటి నుంచి వక్ర భాష్యాలను చెపుతోందన్నారు. ప్రజా సంక్షేమం నినాదంతో 2009 ఎన్నికల్లో తామంతా ప్రజల ముందుకు వెళ్లామన్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చి తీరుతామన్నారు. వైఎస్సార్ వారసులమని కొందరు చెప్పుకుంటున్నా అవన్నీ స్వార్థపూరితమైనవనీ, నిజమైన వారసులం తామేనని మంత్రి బొత్స చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో గత ఏడాది కాలంగా జరిగిన పరిణామాల నేపధ్యంలో మేనిఫెస్టోలోని అంశాలను అమలు పరచడంలో కాస్త జాప్యం జరిగిందనీ, అంతమాత్రన చేతిలో పత్రిక, ఛానళ్లు ఉన్నాయి కదా.. అని ఏదిబడితే అది ప్రచారం చేద్దామంటే కుదరదన్నారు. చనిపోయిన నాయకుడి ప్రజాదరణను స్వార్థంకోసం, స్వప్రయోజనాలకోసం వాడుకోవద్దని జగన్ నుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స.

వెబ్దునియా పై చదవండి