అంతర్యుద్ధం అంటే చర్యలే.. డీజీపి: మీరాపలేరు... టి.నేతలు
డిసెంబరు 31 తర్వాత ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర డీజీపి అరవిందరావు హెచ్చరించారు. అంతర్యుద్ధం వంటి మాటలను ఎవరు ఉపయోగించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ముందుజాగ్రత్త చర్యగా కేంద్రాన్ని బలగాలను కోరామన్నారు. మొత్తం 50 కంపెనీల బలగాలను పంపమని అభ్యర్థించామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేస్తే తమకేమీ అభ్యంతరం లేదనీ, కానీ రెచ్చగొట్టే విధంగా, హింసాత్మక ధోరణిని అవలంభిస్తే మాత్రం చర్యలు తప్పవన్నారు.
రాష్ట్రానికి ఇన్ని బలగాలు అవసరమా...? ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... బలం ఎక్కువగా ఉంటేనే తక్కువ బలం ఉపయోగించడం ద్వారా పరిస్థితిని అదుపు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. అందువల్లనే బలగాలను రప్పిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు డీజీపి వ్యాఖ్యలపై తెరాసతో తెరాస ఐకాస మండిపడింది. డిసెంబరు 31 తర్వాత శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణాకు అనుకూలంగా లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. లాఠీలు, బుల్లెట్లు తెలంగాణా ఉద్యమాన్ని ఆపలేవని ప్రొఫెసర్ కోదండరామ్ హెచ్చరించారు.