నన్ను తొక్కటానికి చూస్తున్నారు: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఒకవైపు ఓదార్పు, రైతు పరామర్శ యాత్రలతో కాంగ్రెస్ ప్రభుత్వం కంటిపై కునుకు లేకుండా చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడపలో పాగా వేశారు. తన తల్లి, తను రాజీనామాలు చేసిన స్థానాల్లో తిరిగి దక్కించుకోవడంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఆయన శనివారం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన విషయంతోపాటు తనను తొక్కేసేందుకు తన నియోజకవర్గం పరిధిలో ముగ్గురికి మంత్రి పదవులను కట్టబెట్టారన్నారు. అంతేకాదు... అధికారం ఆశ చూపి తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని కుటుంబాన్ని చీల్చారని ఆరోపించారు.
నిజాయితీ, సచ్ఛీలత కలిగిన నాయకులనే ఇక్కడి వారు గెలిపిస్తారన్నారు. మరో మూడేళ్లపాటు తన వెంట వచ్చేవారికి కష్టాలు, నష్టాలు ఉంటాయనీ, మూడేళ్లు గడిచిన తర్వాత మరో 30 ఏళ్లపాటు స్వర్ణ బాటేనని అభిమానులు, కార్యకర్తల కేరింతల మధ్య ప్రకటించారు.