కుటుంబం సమక్షంలో బాబాయ్-అబ్బాయిల మధ్య సయోధ్య!!

శనివారం, 25 డిశెంబరు 2010 (12:24 IST)
వైఎస్.జగన్మోహన్ రెడ్డి, వైఎస్.వివేకానంద రెడ్డిల మధ్య సయోధ్య కుదిరినట్టు సమాచారం. క్రిస్మస్ వేడుకలు వీరిద్దరిని ఒకటిగా చేశారు. కడప జిల్లా పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో జగన్, వివేకాలతో సహా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్‌ను చర్చి ఫాస్టర్ సమక్షంలో వివేకా, జగన్‌లు కత్తిరించారు. ఆ తర్వాత కేక్‌ను వారిరువు పరస్పరం తినిపించుకున్నారు. వైఎస్ కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు జగన్‌తో చేతులు కలిపేందుకు వైఎస్.వివేకా సమ్మతించినట్టు సమాచారం.

నిన్నటి వరకు ఒకటిగా ఉన్న మనం.. ఇపుడు వేర్వేరుగా ఉండటం వల్ల రాష్ట్రంలో వైఎస్ పరువు పోతుందని కుటుంబ సభ్యులు వివరించారు. దీంతో కుటుంబం కోసం వివేకా మెత్తబడినట్టు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం వైఎస్ కుటుంబ సభ్యులంతా భేటీ అయ్యారు.

ఆ సమావేశంలో తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని తెగేసి చెప్పిన వివేకా.. శనివారం ఉదయానికి కాస్త మెత్తబడినట్టు తెలుస్తోంది. దీంతో శనివారం వారిద్దరు మరోమారు భేటీ అయ్యారు. ఈ భేటీని జగన్ మామ గంగిరెడ్డి ఏర్పాటు చేశారు.

వెబ్దునియా పై చదవండి