పార్టీని బతికించుకునేందుకే నిరవధిక దీక్ష: ఎంపీ పొన్నం

సోమవారం, 27 డిశెంబరు 2010 (12:29 IST)
తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని బతికించుకునేందుకే నిరాహాదీక్షకు దిగినట్టు కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు సోమవారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్‌లో విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని, తెలంగాణాలో మొహరించిన బలగాలను తక్షణం ఉపసంహరించాలని కోరుతూ నిరాహారదీక్షకు దిగిన విషయం తెల్సిందే.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఉద్యమించిన విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు.

కేసులను దశలవారీగా ఎత్తివేస్తున్నామని, దీక్షను విమరించుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని కూడా తాము తోసిపుచ్చినట్టు చెప్పారు. ఇప్పటికే 565 కేసులు ఉపసంహరించుకున్నట్టు సీఎం తెలిపారన్నారు. అయినప్పటికీ.. తాము దీక్షపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు.

వెబ్దునియా పై చదవండి