తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల దీక్షకు కోదండరామ్ మద్దతు!

సోమవారం, 27 డిశెంబరు 2010 (13:50 IST)
కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎంపీలు చేపట్టిన నిరాహారదీక్షకు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మద్దతు ప్రకటించారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని కోరుతూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కు వద్ద కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు చేపట్టిన దీక్షాశిబిరం వద్దకు కోదండరామ్ వచ్చి తన మద్దతును ప్రకటించారు. వారి దీక్ష విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను తక్షణం ఎత్తివేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ మంత్రి స్వయంగా ఆహ్వానించినా వారిలో చలనం లేదన్నారు. ఇది వలసవాదుల దుర్మార్గాన్ని బయట పెడుతుందన్నారు.

ఇప్పుడు సొంత పార్టీవారే డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం దిగి రావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ సాధనలో విజయం అయ్యే వరకు వారి పోరాటం కొనసాగించాలని, వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.

వెబ్దునియా పై చదవండి