హస్తినలో కేకేఆర్ హల్‌చల్: తెలంగాణ ఎంపీల్లో గుబులు!!

బుధవారం, 5 జనవరి 2011 (11:38 IST)
ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి దేశ రాజధాని హస్తినలో హల్‌చల్ చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌తో కలిసి మంగళవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన బుధవారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు.

రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం జరిపిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ తన తుది నివేదికను కేంద్రానికి సమర్పించిన విషయం తెల్సిందే. ఈ నివేదిక గురువారం ఉదయం పది గంటలకు బహిర్గతం కానుంది. దీంతో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు డీఎస్, కేకేఆర్‌లు హస్తినకు చేరుకున్నారు.

ఈ పర్యటనలో తొలుత సోనియాతో సమావేశమైన సీఎం ప్రస్తుత పరిస్థితులను కూలంకుషంగా వివరించారు. అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి సీపీ.జోషీ, జలవనరుల శాఖామంత్రి పవన్ కుమార్ బన్సల్, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, సాయంత్రం 3.30 గంటలకు హోం మంత్రి చిదంబరంతో భేటీ అవుతారు.

ఇదిలావుండగా, తెలంగాణ నివేదిక బహిర్గతం కానున్న నేపథ్యంలో.. రాష్ట్ర ఏర్పాటుపై అధిష్టానం వెనక్కి తగ్గితే తమ పదవులకు రాజీనామాలు చేస్తామని ప్రకటించిన తెలంగాణ ప్రాంత ఎంపీలతో అధిష్టానం భేటీ కానుంది. ఇందుకోసం వీరిందరినీ హుటాహుటిన ఢిల్లీకిపిలుపించుకుంది. కాంగ్రెస్ వృద్ధనేత ప్రణబ్ ముఖర్జీ వీరితో సమావేశంకానున్నారు.

ఒకవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో అధిష్టానం పెద్దలందరినీ కలుస్తూ హడావుడిగా కనిపిస్తున్నారు. మరోవైపు.. తెలంగాణ ప్రాంత ఎంపీలు మాత్రం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాము చేసిన నిరాహారదీక్షతో పాటు చేసిన వ్యాఖ్యలపై హైకమాండ్ ఇప్పటికే గుర్రుగా ఉన్న విషయం తెల్సిందే. దీంతో ఎలాంటి క్లాస్ పీకుతారనే భయం వారిలో నెలకొంది. మొత్తం మీద హస్తినలో తెలుగువారి సందడి బాగానే ఉంది.

వెబ్దునియా పై చదవండి