పార్టీ పేరు నమోదుకు ఈసీకి దరఖాస్తు సమర్పించిన వైవీ!!

బుధవారం, 5 జనవరి 2011 (14:40 IST)
కడప మాజీ ఎంపీ, యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. తాను ప్రకటించినట్టుగా కొత్త పార్టీ ఏర్పాట్ల ప్రక్రియను వేగవంతం చేశారు. ఇందులోభాగంగా జగన్ వర్గానికి చెందిన అత్యంత కీలక నేత వైవీ.సుబ్బారెడ్డి బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించారు.

ఈ సమావేశం అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కొత్త పార్టీ ఏర్పాట్లు జోరందుకున్నాయన్నారు. పార్టీ పేరులో మహానేత వైఎస్ఆర్‌తో పాటు కాంగ్రెస్ పేరు ప్రతిబింభించేలా ఉంటుందన్నారు.

అయితే, దీనిపై ఎన్నికల సంఘం నుంచి రెండుమూడు వారాల్లో ఒక ప్రకటన వెలువడుతుందన్నారు. ఈ ప్రకటన వెలువడిన తర్వాత అన్ని విషయాలను బహిర్గతం చేస్తామన్నారు. అంతేకాకుండా, పార్టీ పేరును ఖరారు చేసుకున్న తర్వాత విధివిధానాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

ఇదిలావుండగా, వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే జగన్ తన కొత్త పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పేరుతోనే ఈసీని దరఖాస్తు సమర్పించినట్టు విశ్వసనీయ సమాచారం.

వెబ్దునియా పై చదవండి