ఆరు అవకాశాల్లో మూడు ఆచరణ సాధ్యమట: చిదంబరం

గురువారం, 6 జనవరి 2011 (15:44 IST)
జస్టీస్ శ్రీకృష్ణ కమటీ తన నివేదిక ద్వారా చేసిన ఆరు అవకాశాల్లో మొదటి మూడు ఆచరణ సాధ్యం కాకపోవచ్చని కమిటీయే అభిప్రాయపడిందని కేంద్ర హోం మంత్రి చిదంబరం అన్నారు. గురువారం అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ప్రస్తావించిన ఆరు అవకాశాల్లో మొదటిది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలి. అయితే కమిటీయే ఈ సూచన ఇక ఎంతమాత్రం ఆచరణ సాధ్యం కాదని అభిప్రాయపడిందని ఆయన తెలిపారు. రెండో సూచనగా.. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంచి సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని, అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అంత సులభమైన అంశం కాదని పేర్కొందని చెప్పారు.

మూడవ సూచనగా రాయల తెలంగాణ, కోస్తాంధ్రలుగా రాష్ట్రాన్ని విడదీసి హైదరాబాద్‌ను రాయలతెలంగాణలో కలపడమన్నారు. ఇది కూడా మూడు ప్రాంతాలకూ ఆమోదయోగ్యమైన సూచన కాకపోవచ్చునని కమిటీ భావించిందని వివరించారు. ఈ మూడు సూచనలూ కమిటీయే ఆచరణసాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని చిదంబరం గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు.

ఇకపోతే.. నాలుగో సూచనగా రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణాలుగా విడదీసి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని అభిప్రాయపడింది. ఇది తెలంగాణలో తీవ్రమైన ప్రజా ప్రతిఘటనకు దారితీయవచ్చునని కమిటీ అభిప్రాయపడింది. ఐదో అవకాశంగా రాష్ట్రాన్ని తెలంగాణ, సీమాంధ్రగా విభజన చేసి హైదరాబాద్‌ను తెలంగాణకు రాజధాని చేయాలని, అదేసమయంలో సీమాంధ్ర కొత్త రాజధానిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

చివరగా ఆరవ సూచన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తెలంగాణకు ప్రత్యేక రాజ్యాంగ పరిరక్షణ కల్పించడం. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి మూడు ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించిందని గుర్తు చేశారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం అసాధ్యమని కమిటీ అభిప్రాయపడినట్టు హోంమంత్రి పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి