నేను, కేసీఆర్‌లు రాజీనామాకు సర్వదా సిద్ధం: హరీష్

సోమవారం, 17 జనవరి 2011 (13:15 IST)
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తనతో పాటు.. తమ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే టి.హరీష్ రావు చెప్పారు. ఆయన మాట్లాడుతూ తమ అంతిమ లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటేనన్నారు. ఇందుకోసం తాము తమ పదవులను వదులుకునేందుకు సైతం సిద్ధంగా ఉన్నామన్నారు.

ఈ సందర్భంగా సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అంజన్‌కు మంత్రి పదవి వస్తే సంతోషిస్తామన్నారు. కానీ ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఇంతవరకూ ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలకు పదవులు ఎరవేసే కుట్రను కాంగ్రెస్ పన్నుతోందన్నారు. దానికి అంజన్‌కుమార్ ఓ పావుగా మారారని హరీశ్‌ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పదవులే అడ్డంకి అయితే తాను, కేసీఆర్ రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన సవాల్ విసిరారు.

ఇకపోతే.. తాము గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు సీమాంధ్ర ప్రజానీకానికి వ్యతిరేకం కాదన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందన కొంతమంది పెట్టుబడిదారులే తెలంగాణకు అడ్డుగా ఉన్నారన్నారు. అందువల్ల సీమాంధ్ర ప్రజలు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని హరీష్ విజ్ఞప్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి