తెలంగాణ సాధన : విరమణ కాదు.. విరామమే : కోమటిరెడ్డి

బుధవారం, 9 నవంబరు 2011 (17:13 IST)
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను చేసిన ఆమరణ నిరాహారదీక్షను విరమించుకోలేదని, కేవలం విరామం మాత్రమే ఇచ్చినట్టు రాష్ట్ర మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ తొమ్మిది రోజులుగా ఆయన దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ విజ్ఞప్తి మేరకు ఆయన నిమ్స్‌లో తన దీక్షను విరమించినట్టు ఆయన తెలిపారు.

కోమటిరెడ్డికి పార్లమెంటు ఎదుట ఆత్మహత్య చేసుకున్న యాదగిరి తల్లి చంద్రమ్మ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేసింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటే తన అంతిమ లక్ష్యమన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల వల్లే తెలంగాణ ఆలస్యమైందన్నారు. త్వరలో తెలంగాణ కోసం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.

తెలంగాణపై త్వరలో కేంద్రం స్పష్టమైన ప్రకటన చేస్తుందని ఆజాద్ హామీ ఇచ్చినందువల్లే దీక్ష విరమిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఇది విమరణ కాదని, విశ్రాంతి మాత్రమేనని ఆయన ప్రకటించారు. కేంద్ర నాయకత్వం, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే తాను దీక్షను చేపట్టానని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి