రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ అధిష్టానం పరిష్కరించనుంది. ఇదే అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ శుక్రవారం సాయంత్రం భేటీకానుంది. అయితే, కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై రెండో ఎస్సార్సీయే తమ విధానమని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ అంశాన్ని ఏవిధంగా పరిష్కరిస్తుందన్నదే ఇపుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
పైపెచ్చు.. రెండో ఎస్సార్సీ వార్తలతో తెలంగాణలో తలెత్తిన ఆగ్రహావేశాలను చల్లార్చడంతో సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా కాంగ్రెస్ పెద్దలు వ్యూహరచన చేస్తున్నారు. ఇందుకోసం తక్షణం మరో తాత్కాలిక ప్రణాళికను తెరపైకి తేవాలని భావిస్తోంది. దానికి తుదిరూపునిచ్చే ప్రయత్నాల్లో ట్రబుల్ షూటర్ ప్రణబ్ ముఖర్జీ తలమునకలుగా ఉన్నట్టు సమాచారం.
రాష్ట్ర విభజన అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి, ప్రస్తుతానికి తెలంగాణ అభివృద్ధికి చట్టబద్ధ అధికారాలు, నిధులు, విధులతో కూడిన ప్రాంతీయ మండలి ఏర్పాటును కేంద్రం ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వచ్చే వారం మొదట్లోనే కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన చేయవచ్చని సమాచారం.