డీజీపీగారూ.. దయచేసి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవద్దు

శనివారం, 31 డిశెంబరు 2011 (21:31 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెరగడానికి రెచ్చగొట్టే వస్త్రాలంకరణ కూడా ఒక కారణమవుతోందని రాష్ట్ర డీజీపి చేసిన వ్యాఖ్యలపై కొందరు విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే పలు మహిళా సంఘాలు మాత్రం స్వాగతిస్తున్నాయి. శనివారం స్వయంగా మహిళా సంఘాల నాయకురాళ్లు డీజీపిని కలిసి ఆయన చేసిన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకోవద్దని విన్నవించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. పాశ్చాత్య వస్త్రధారణ మోజులో పడి నేటి మహిళలు బిగుతు దుస్తులతో రోడ్లపై వెళుతూ ఎన్నో సమస్యలకు కారణమవుతున్నది నిజమన్నారు. కొంతమంది అమ్మాయిల బిగుతు వస్త్రధారణ తాలూకు పోస్టర్లను హైవే రోడ్లపై చూసి ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు.

ముప్పావు వంతు శరీరాన్ని చూపెడుతూ.. తమ ఇష్టం వచ్చినట్లు వస్త్రాలంకరణ చేసుకుంటాం.. మమ్మల్ని మీరు చూడొద్దని పురుషులను అంటే.. అలా చూడకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. నేటి అమ్మాయిల దుస్తుల అలంకరణలో తప్పనిసరిగా మార్పు రావాలని వారు కోరారు.

ఆకర్షణ అనేది స్త్రీలకు దేవుడు ఇచ్చిన వరం అనీ, అయితే కురచ దుస్తుల అలంకరణతో పరిస్థితి దిగజారుతోందని చెప్పుకొచ్చారు. రామాయణ కాలంలో నార చీరెలు ధరించిన సీతమ్మనే రావణుడు అపహరించాడనీ, అటువంటిది రెచ్చగొట్టే దుస్తులు ధరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదని అన్నారు.

వెబ్దునియా పై చదవండి