జీవితా రాజశేఖర్ అటు తిరిగి ఇటు తిరిగి కమలం గూటికి...

సోమవారం, 20 జనవరి 2014 (19:19 IST)
WD
జీవితా రాజశేఖర్ ఇద్దరూ అటు తిరిగి ఇటు తిరిగి చిట్టచివరికి కమలం గూటికి చేరారు. ఐతే భాజపాలో అలా చేరారో లేదో అక్కడ ఎన్నాళ్లు ఉంటారోనన్న చర్చలు మొదలయ్యాయి. ఇదివరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభల్లో మీసాలు మెలిస్తూ ప్రసంగాలు చేసిన రాజశేఖర్ ఇప్పుడు ఏ టైపులో కమలదళంలో సాగుతారన్నది చర్చనీయాంశమైంది.

కేంద్ర పర్యాటక శాఖా మంత్రి చిరంజీవితో పొసగక పోవడం వల్లే వారు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారని సమాచారం. చాలాకాలంగా చిరంజీవి, రాజశేఖర్ దంపతుల మధ్య వైరం ఉన్న సంగతి తెలిసిందే.

టిడిపితో రాజకీయ అరంగేట్రం చేసి.. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిపై అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన జీవిత రాజశేఖర్ దంపతులు ఆయన మృతి తర్వాత ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.

కానీ, జగన్‌తో పడక తిరిగి వారు కాంగ్రెసు గూటికి చేరారు. అయితే చిరంజీవి ఉన్న పార్టీలో పడక బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. అయితే బీజేపీలో తాము ఇంకా చేరలేదని సినీనటి జీవిత రాజశేఖర్ తెలిపారు. హైదరాబాద్‌లో ఆమె మాట్లాడుతూ, మోడీ నాయకత్వం అమోఘంగా ఉందని ప్రశంసించారు.

వెబ్దునియా పై చదవండి