గల్లా జయదేవ్ ఆస్తులు రూ.671 కోట్లు... మహేష్ బాబు బావకు మద్దతు

గురువారం, 17 ఏప్రియల్ 2014 (18:10 IST)
WD
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గుంటూరు లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంలో జయదేవ్ సమర్పించిన అఫిడవిట్లో ఆయన ఆస్తుల విలువ రూ. 671 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. జయదేవ్ ఆస్తుల లెక్క తేలడంతో లోక్ సభ బరిలో నిలుస్తున్న అభ్యర్థుల్లో మహేష్ బాబు బావ జయదేవ్ అత్యంత ధనవంతుడని స్పష్టమైంది.

మరోవైపు ఎం.పి.గా పోటీ చేస్తున్న గల్లా జయదేవ్‌కు మద్దతు ప్రకటిస్తూ ఈరోజు సూపర్‌స్టార్‌ మహేష్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఆ వివరాలు... నేనెప్పుడూ రాజకీయాలకి అతీతంగానే ఉన్నాను. ఉంటాను కూడా. అయినప్పటికీ మా బావ జయదేవ్‌ గల్లా గుంటూరు నుంచి ఎం.పిగా పోటీ చేస్తున్నందు వల్ల ఆయన గురించి మాట్లాడాలనిపించింది.

మా అక్క పద్మతో ఆయన వివాహం అయినప్పుడు నా వయసు పదమూడు. అప్పటి నుంచి ఆయన నాతో ఎంతో చనువుగానూ, అభిమానంగానూ ఉండేవారు. తర్వాత్తర్వాత నేను ఎదుగుతున్నకొద్దీ ఆయన విలువలతో కూడిన తన లక్ష్యాలను నిర్దేశించుకోవడంలోను, వాటిని అవే విలువలతో సాకారం చేసుకోవడంలోనూ చేసిన కృషిని చూసి ఆయనని అర్థం చేసుకున్నాను.

ఆయన నాకు ఎప్పుడూ స్ఫూర్తిగానూ ఆదర్శప్రాయుడిగానూ నిలిచారు. అమరరాజా గ్రూప్‌, అమరాన్‌ బ్రాండ్‌ ఇవాళ ఈ స్థాయిని చేరుకున్నాయంటే అది ఆయన కృషి, పట్టుదల, విలువలే కారణం. ఆయన చేసిన కృషిని, సూక్ష్మపరిశీలనాశక్తిని, సాధించిన విజయాలని, మీడియా వారు, పారిశ్రామిక సంస్థలు కూడా ఎంతో గుర్తించాయి.

ఆయన ఎప్పుడూ రాజకీయాలలో రావాలనే ఇష్టాన్ని, ఆసక్తినీ కనబరిచేవారు. నాకు స్వతహాగా రాజకీయాల పట్ల ఉన్న అనాసక్తి వల్ల నాకు ఆయన ఆసక్తి అప్పట్లో అర్థం కాలేదు. మార్పును సాధించాలంటే రాజకీయాలలోకి ప్రవేశించే వారి నాణ్యత పెరగాలి అని ఎప్పుడూ అంటుండేవారు. అలాగే రాజకీయాల ద్వారా అసంఖ్యాకమైన ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఉంటుందని ఆయన నమ్మకం.

అందుకే ఆయన ఎప్పుడూ అంటుంటారు, మార్పు తీసుకొచ్చేది ఒక వ్యక్తి ఐనా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి అని. నాకు ఆయన మీద నమ్మకం ఉంది. మార్పు తీసుకురాగలరనే నమ్మకం ఉంది. నా మద్దతు, నా ఓటు ఆయనకే. మీ మద్దతు, మీ ఓటు ఆయనకే అని ఆశిస్తున్నాను. గుంటూరు భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్‌, భారతదేశ పురోగతికి మా బావ జయదేవ్‌ గల్లా ఒక ప్రతినిధి.

వెబ్దునియా పై చదవండి