తెలంగాణ అభివృద్ధి చెందాలంటే టీడీపీ రావాలి : చంద్రబాబు

ఆదివారం, 20 ఏప్రియల్ 2014 (13:59 IST)
File
FILE
తెలంగాణ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి రావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా తాము చేసిందేనని ఆయన అన్నారు.

ఆదివారం నల్గొండ జిల్లా దేవరకొండలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, కన్వెన్షన్ సెంటర్, చుట్టూ అవుటర్ రింగ్ రోడ్డు తాము చేపట్టినవేనని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ 160 కిలోమీటర్ల అవుటర్ రింగు రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించడం తమ దూరదృష్టికి నిదర్శనమన్నారు.

జాబు (ఉద్యోగం) రావాలంటే టీడీపీ ఇక్కడ, కేంద్రంలో నరేంద్ర మోడీ రావాలని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే నల్లగొండ జిల్లాలో జ్యూస్ ఫ్యాక్టరీలు పెట్టించి బత్తాయికి గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ను నమ్ముకుంటే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని గతంలో తాను చెప్పిన మాటలే నిజమయ్యాయన్నారు.

తెలంగాణలో నిరంతరాయంగా విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారని కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. తమ హయాంలో తెలంగాణలో అదనంగా 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి