జగన్ వర్గానికి వీర విధేయులు 'ఆ ఇద్దరు' మంత్రులేనా!!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది జగమెరిగిన సత్యం. ఇది పలు సందర్భాల్లో రుజువైంది కూడా. కానీ, ఎవరెన్ని చెప్పినా.. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వారు మాత్రం వైఎస్ వర్గం వీరవిధేయులుగానే ఉంటారని అందరూ భావించారు. కానీ.. పరిస్థితి తారుమారైంది. కేవలం సాక్షి ఛానల్ ప్రసారం చేసిన ఒకే ఒక్క కథనాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని తన భవిష్యత్తే లక్ష్యంగా జగన్ వర్గానికి వ్యతిరేకంగా ముద్ర వేసుకున్నారు.

ఇలాంటి వారిలో రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్. రాష్ట్ర గ్రామీణ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందు వరుసలో ఉన్నారు. వీరిద్దరిలో దానం నాగేందర్ ఒకానొక సందర్భంగా వైఎస్ పంచె సరి చేస్తూ ఫోటోగ్రాఫర్లకు కూడా చిక్కాడు. ఆ సంఘటనలు ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేరు. అంతటి వీర విధేయుడు.

అందుకే.. 2004లో తెదేపా తరపున పోటీ చేసి గెలిచినప్పటికీ.. వైఎస్ ముఖ్యమంత్రి అయిన వెంటనే తన శాసనసభ సభ్యత్వానికి దానం రాజీనామా చేశారు. అపుడు కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వక పోవడంతో రాత్రికి రాత్రి తెదేపాలో చేరి టిక్కెట్ తెచ్చుకుని ఖైరతాబాద్‌లో పోటీ చేసి గెలుపొందాడు. అనంతరం దానం వైఎస్ చేరదీసి గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయడమేకాకుండా, 2009 ఎన్నికల్లో అసెంబ్లీ సీటు ఇప్పించాడు. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రిగా చేశారు.

ఇకపోతే.. నల్గొండ జిల్లాల్లో తిరుగులేని నేతలుగా కోమటిరెడ్డి సోదరులు వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డిలను వైఎస్ తీర్చిదిద్దారు. వీరిద్దరి ఎదుగుదలకు వైఎస్ ఎంతో అండగా నిలిచారు. వీరికి వైఎస్ కుటుంబం వ్యాపారాల్లో కూడా వాటాలు ఉన్నాయి. అందుకే, ఎవరు ఎటువెళ్లినా.. వీరిద్దరు మాత్రం జగన్‌కు అత్యంత నమ్మకస్తులుగా ఉంటారని భావించారు. కానీ, ఒక్క సంఘటనతో వీరు వ్యతిరేక వర్గంగా ముద్రపడ్డారు. సాక్షి ఛానల్ ప్రసారం చేసిన కథనాన్ని అస్త్రంగా చేసుకుని అధిష్టానానికి వీర విధేయత ప్రదర్శించేందుకు అత్యుత్సాహం చూపారు.

జగన్‌ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. స్వయంగా ధర్నాల్లో పాల్గొంటున్నారు. పోటీలు పడి మరీ జగన్‌పై దుమ్మెత్తిపోశారు. వైఎస్‌ మృతి చెందిన తర్వాత జగన్‌ను సీఎం చేయాలంటూ సంతకం చేసిన వారిలో నాగేందర్‌ ముందువరుసలో ఉన్నారు. అవన్నీ గతం గతః, అదేవిధంగా నల్లగొండ జిల్లాలో వైఎస్‌ తిరుగులేని నేతగా తయారుచేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా జగన్‌ను తూర్పార పడుతున్నారు.

వీరితో పాటు.. జగన్ ముద్దుగా అత్తమ్మ అని పిలుచుకునే హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, వట్టి వసంత కుమార్‌, శిల్పా మోహన్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, జూపల్లి కృష్ణారావు కూడా సోనియాపై వ్యతిరేక కథనాల నేపథ్యంలో కన్నెర్రచేసి, అధిష్టానానికి తమ విధేయత చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ వీర విధేయులుగా తన కుటుంబ బంధువు, రాష్ట్ర గనుల శాఖామంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, తన దృష్టిలో అధిష్టానం అంటే వైఎస్ అని ప్రకటించిన మరో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు ముద్రపడ్డారు.

వెబ్దునియా పై చదవండి