కాంగ్రెస్-తెదేపాలను ఇరుకున పెట్టేందుకే కేసీఆర్ డుమ్మా!!

బుధవారం, 5 జనవరి 2011 (16:40 IST)
రాష్ట్ర విభజన అంశంలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ఇరుకున పెట్టేందుకే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు ఈనెల 6వ తేదీన జరుగనున్న అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రెండు కళ్ళ సిద్ధాంతంతో చంద్రబాబు, స్పష్టమైన వైఖరిని వెల్లడించకుండా కాంగ్రెస్ పార్టీలు కాలయాపన చేస్తున్నాయి. ఇదే తెలంగాణ ఏర్పాటుకు పెద్ద అడ్డంకిగా మారింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితులపై యేడాది పాటు అధ్యయనం చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నిర్ణీత గుడువులోగా తన తుది నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఈ నివేదికలో పేర్కొన్న అంశాలను బయటపెట్టేందుకు వీలుగా రాష్ట్రంలో ఎనిమిది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఇందుకోసం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యేందుకు ఒక్కో పార్టీ తరపున ఇద్దరేసి ప్రతినిధులను హోంమంత్రి చిదంబరం ఆహ్వానించారు. ఇది తెలంగాణ ఉద్యమకారులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ప్రధానంగా తెదేపా, కాంగ్రెస్ పార్టీల నుంచి ఇద్దరేసి ప్రతినిధులను ఆహ్వానించడం వల్ల సమైక్యాంధ్ర, తెలంగాణకు అనుకూలంగా తమతమ అభిప్రాయాలను వెల్లడించే వీలు కల్పించిందని ఆ పార్టీ ఆరోపిస్తోంది.

పైపెచ్చు.. అఖిలపక్షంలో ఓటింగ్ నిర్వహిస్తే సమైక్యవాదానికే మెజారిటీ వస్తుంది. ప్రరాపా, సీపీఎంతో పాటు లోక్‌సత్తా పార్టీలు సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్న విషయం తెల్సిందే. వీటన్నింటినీ బేరీజు వేసిన కేసీఆర్.. అఖిలపక్ష సమావేశానికి హాజరు కారాదని నిర్ణయం తీసుకున్నారు. పనిలోపనిగా సీపీఐను కూడా హాజరుకావద్దని హుకుం జారీ చేయగా, ఆ పార్టీ నేత నారాయణ కేసీఆర్ ప్రతిపాదనను తోసిపుచ్చారు. భాజపా మాత్రం కేసీఆర్ మాటకు కట్టుబడి సమావేశానికి గైర్హాజరు కానున్నట్టు ప్రకటించింది.

వాస్తవానికి కమిటీ నివేదికలోని అంశాలను బహిర్గతం చేసేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం భావించడంలోనూ మతలబు ఉంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా రాష్ట్రానికి చెందిన 8 రాజకీయ పార్టీలను చర్చలకు ఆహ్వానించడం మళ్లీ సమస్యను మొదటికి తేవడానికేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. పార్టీకి ఇద్దరేసి ప్రతినిధులను ఆహ్వానించడం ఆ అభిప్రాయానికి మరింత బలం చేకూరుస్తోంది.

ఏకాభిప్రాయ సాధన కోసం శ్రీకృష్ణ కమిటీ ద్వారా ప్రయత్నాలు చేశామని, ఇంకా చేస్తామని చిదంబరం అఖిలపక్ష సమావేశంలో చెప్పి తప్పించుకునే అవకాశాలున్నాయన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. బహుశా, అందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారనే వాదన వినిపిస్తోంది. తెలంగాణపై పార్టీ విధానాన్ని శ్రీకృష్ణ కమిటీ అడగలేదు, నివేదిక వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వమైనా ఆ పని చేయాల్సింది. కానీ, అలా చేయకండా మళ్లీ పాత పద్దతిని కొత్తగా ముందుకు తెస్తోంది. దీన్ని కెసిఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అంతేకాకుండా, సమావేశానికి ఇద్దరేసి ప్రతినిధులను ఆహ్వానించడాన్ని కేసీఆర్ వ్యతిరేకించడంలోనూ అర్థం ఉంది. ఒక పార్టీ నుంచి ఒకే ప్రతినిధి ఉంటే తెలంగాణపై ఏదో ఒక నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. అప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ పార్టీలను తెలంగాణ ప్రాంతంలో ఎండగట్టడానికి వీలవుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందనే ఆశ సన్నగిల్లిన నేపథ్యంలో ఆ పార్టీలను రెండింటినీ ఎండగట్టడానికి తగిన అవకాశం లభిస్తుందనే కేసీఆర్ ఆలోచన.

వెబ్దునియా పై చదవండి