కేకేఆర్ సర్కారును కూల్చేద్దాం.. మధ్యంతరం సృష్టిద్దాం!!!

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారును కూల్చేసి మధ్యంతర ఎన్నికలను ఎదుర్కొందామనే తలంపులో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై సీనియర్ నేతలతో ఎడతెరిపి లేకుండా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి మంగళవారం కేసీఆర్‌తో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఆ సమయంలో కేసీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనివున్న విషయం తెల్సిందే. దీన్ని క్యాష్ చేసుకోవడం ద్వారా కేకేఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టి మధ్యంతరం ఎన్నికల వైపు అడుగులు వేస్తే పరిస్థితి ఎలావుంటుందనే అంశంపై వారిరువురు చర్చించినట్టుగా తెలుస్తోంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న "రెండుకళ్ళ సిద్ధాంతం" తెలంగాణ ప్రాంత నేతలకు ఏమాత్రం రుచించడం లేదు. ఇదే అంశాన్ని పోచారంతో పాటు.. పలువురు సీనియర్ నేతలు బాహాటంగానే ప్రకటించారు. తెలంగాణ అంశంలో పార్టీ వైఖరి నచ్చకనే గుడ్‌బై చెపుతున్నట్టు పోచారం ప్రకటించారు కూడా.

వీటన్నింటినీ బేరీజు వేసిన కేసీఆర్.. మధ్యంతరత ఎన్నికలనే ఎర చూపుతూ కాంగ్రెస్, తెదేపా సభ్యులకు గాలం వేస్తున్నారు. గత ఉపఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఏకపక్ష తీర్పును ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని కేసీఆర్ వారికి హితవు పలుకుతున్నారు. దీంతో పెక్కుమంది నేతలు తెరాసవైపునకు మొగ్గు చూపేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. పైపెచ్చు తెలంగాణ అంశంలో కిందిస్థాయి నుంచి నేతలపై ఒత్తిడి నానాటికీ పెరుగుతోంది. దీంతో వారు తమ రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఇదిలావుండగా కేసీఆర్ మరో వాదననూ తెరపైకి తెస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్.జగన్మోహన్‌ రెడ్డి తప్పకుండా కూలదోస్తారని, మార్చి-ఏప్రిల్‌లో మధ్యంతర ఎన్నికలొచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని బల్లగుద్ది వాదిస్తున్నారు. తెలంగాణపై తెదేపా ద్వంద్వ వైఖరి కారణంగా మధ్యంతర ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలెవరూ గెలవలేరని, ఇదే పరిస్థితి కాంగ్రెస్‌కు ఎదురుకాక తప్పదని నమ్మబలుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో తిరుగులోని శక్తిగా తెరాస అవతరించడం ఖాయమనే వాదనను గట్టిగా వినిపిస్తున్నారు.

దీంతో రాజకీయ నేతలు ఆశలపల్లకిలో విహరిస్తూ.. తెరాస కారు ఎక్కేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇదే వాదనతో తెరాస ముఖ్యులు ఆపరేషన్ ఆకర్ష్‌ను గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్నారు. ఈ ప్లాన్‌కు ఎక్కువగా తెదేపా నేతలే ఆకర్షితులవుతున్నారు. అయితే తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై దృష్టిసారించాలని కేసీఆర్ సహచరులకు సూచించినట్టు తెలుస్తోంది. మొత్తంమీద కేసీఆర్ తన లక్ష్యాన్ని చేరుకునే దిశగా వేగంగా పావులు కదుపుతూ తెలంగాణలో "ఎదురులేని మనిషి"గా తయారవుతున్నారు.

వెబ్దునియా పై చదవండి