పాకిస్తాన్ దేశాధ్యక్షుడిగా పర్వేజ్ ముషారఫ్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత ఆ దేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముషారఫ్ దేశాధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా.. ఎమర్జెన్సీకి ముందు ముషారఫ్ దేశ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం చెల్లదని కోరుతూ దాఖలైన పిటీషన్లు అన్నింటిని సుప్రీం కోర్టు కొట్టి వేసింది. దీంతో ముషారఫ్‌కు ఉన్న అడ్డంకులు తొలగిపోయినట్టయింది.
ఈ సందర్భంగా ముషారఫ్ ప్రసంగిస్తూ.. దేశంలో నెలకొన్న పరిస్థితుల నుంచి త్వరలోనే అధికమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. తన నుంచి ఆర్మీ చీఫ్ బాధ్యతలను స్వీకరించిన ఖియానీపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఖియానీ గత రెండు దశాబ్దాలుగా తనకు తెలుసుని, విధి నిర్వహణలో ఆయనకు ఆయనే సాటి అని ముషారఫ్ పేర్కొన్నారు.