భారత్-పాక్‌లకు చైనా మధ్యవర్తిత్వం వహించాలి: జర్దారీ

ఆసియాలో పలు దేశాల మధ్య వివాదాస్పదమైన సమస్యల పరిష్కారానికి చైనా మధ్యవర్తిత్వం వహించాలని పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ పిలుపునిచ్చారు. భారతదేశం గురించి స్పష్టంగా చెప్పకపోయినా, ఆయన స్వరంలో ఢిల్లీ- ఇస్లామాబాద్‌ల మధ్య ఉన్న విభేధాలను చైనా పరిష్కరించాలని చెప్పినట్లు తెలుస్తోంది.

మొన్నటివరకూ భారత్-పాక్ దేశాల మధ్య ఉన్న సమస్యలను అమెరికా పరిష్కరించాలని చెప్పుకుంటూ వచ్చిన పాకిస్తాన్ అకస్మాత్తుగా తన బాణీని మార్చి చైనాను తెరపైకి తెచ్చింది. అయితే భారతదేశం మాత్రం తన దేశానికి సంబంధించిన ఏ సమస్య పరిష్కారానికైనా మూడో దేశం జోక్యం కుదరదని తెగేసి చెప్పింది.

ఆసియా ఖండంలో అతి పెద్ద దేశమైన చైనా తన పొరుగు దేశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జర్దారీ అన్నారు. కాగా ఇటీవల ముంబయిపై జరిగిన దాడుల తర్వాత అమెరికా పాకిస్తాన్‌పై కఠిన వైఖరి ప్రదర్శించడంతో జర్దారీ ఎటూ దిక్కుతోచని స్థితిలో పడ్డారనీ, ఫలితంగానే చైనాను శరణుజొచ్చారనే వార్తలు వినవస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి