వైట్‌హౌస్ రేసులో మేము లేము: హిల్లరీ క్లింటన్, జిందాల్

అమెరికా అధ్యక్ష పదవికి 2012లో జరగనున్న సాధారణ ఎన్నికలలో పోటీ చేయటంపై తమకు ఆసక్తి లేదని లూసియానాకు చెందిన భారత సంతతి గవర్నర్‌ బాబీ జిందాల్‌, అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌‌లు చెప్పారు. జిందాల్‌ రిపబ్లికన్‌ పార్టీకి, క్లింటన్‌ డెమొక్రాట్‌ పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

అమెరికా అధ్యక్ష పదవి రేసులో వీరిరువురూ ఉన్నారంటూ వస్తున్న ఊహాగానాలను వారు తోసిపుచ్చారు. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బాధ్యతలు తనకు ఎంతగానో సంతృప్తిని ఇస్తున్నాయని, ఎన్నికద్వారా ఉన్నత పదవిని పొందాలన్న ఆసక్తి లేదని ఓ టివి ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లింటన్ చెప్పారు.

అలాగే.. వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల్లో లూసియానా గవర్నర్‌గా తిరిగి ఎన్నికయ్యేందుకు తాను ఆసక్తి చూపుతున్నానని జిందాల్‌ స్పష్టం చేశారు. 2012లో రిపబ్లికన్‌ టికెట్‌పై ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపికైతే..? అన్న ప్రశ్నకు జిందాల్‌ సమాధానమిస్తూ.. "నాకు వచ్చిన ఆఫర్‌ను దేనినీ వదులుకోబోను, అలాగని నాకు నేనుగా ఆ పదవికి ఆశపడబోన"ని చెప్పారు. లూసియానా గవర్నర్‌గా రెండోసారి ఎన్నిక కావాలన్నదే తన ఆశయమని ఆయన పునరుద్ఘాటించారు.

వెబ్దునియా పై చదవండి