కంటతడి పెట్టిన మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమనేత

మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమనేత ఆంగ్‌సాన్ సూకీ దశాబ్ద కాలం తర్వాత తన కుమారుడిని చూసి కంటతడి పెట్టారు. తన కుమారుడు కిమ్ ఏరిస్ (33)ను 10 సంవత్సరాల తర్వాత చూసిన సూకీ కళ్లు ఒక్కసారిగా చెమ్మగిల్లాయి. ప్రస్తుతం ఏరిస్ బ్రిటన్‌లో నివసిస్తున్నాడు.

తన తల్లిని కలిసేందుకు మయన్మార్ జుంటా ప్రభుత్వం వీసా మంజూరు చేయడంతో ఏరిస్ మంగళవారం మయన్మార్ చేరుకున్నాడు. ఏడేళ్లు గృహ నిర్భంద శిక్ష అనుభవించిన సూకీని మయన్మార్ జుంటా ప్రభుత్వం ఈ నెల 13న విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఏరిస్‌ను కలిసేందుకు యాంగూన్ ఎయిర్‌పోర్టు చేరుకున్న సూకీ చాలా కాలం తర్వాత తొలిసారిగా తన కుమారుడిని చూడగానే.. కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం చిరునవ్వుతో మీడియాతో మాట్లాడుతూ.. "నాకు చాలా సంతోషంగా ఉంద"ని చెప్పారు.

ఏరిస్ విమానం నుంచి దిగి బయటకు వస్తూ.. తన కుడిచేతితో ప్రజలకు అభివాదం చేశారు. తన కుడిచేయిపై సూకీ పార్టీ (నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ) పతాకాన్ని, గర్తును "టాటూ"గా వేయబడి ఉంది. ఆ టాటూని చూసిన సూకీ నవ్వుతూ తన కుమారుడిని దగ్గరకు తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి