అమెరికాలోని టక్సన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో రిపబ్లిక్ పార్టీ ఎంపీ గిఫోర్డ్ తీవ్ర గాయాలకు గురైయ్యారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మరణించగా, 12 మంది గాయపడ్డారు. ముందుగా ఈ కాల్పుల్లో గిఫోర్డ్ మరణించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఆ వార్తలను ఖండించిన వైద్యులు ఎంపీ గిఫోర్డ్ పరిస్థితి విషమంగా ఉందని, ఎంపీ ప్రాణాలతోనే ఉన్నారని యూనివర్శిటీ మెడికల్ సెంటర్ సమాచార ప్రతినిధి డార్సీ స్లాటెన్ చెప్పారు.
తలలో బుల్లెట్ దూసుకెళ్లిందని, కానీ ఎంపీని కాపాడవచ్చుననే నమ్మకం ఉందని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీకి శస్త్ర చికిత్స జరుగుతోంది. కాగా, ఈ కాల్పుల్లో గాయపడిన మరో 9 మందికి కూడా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
షాపింగ్ సెంటర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గిఫోర్డ్ పాల్గొనాల్సి ఉండగా, ఓ గుర్తు తెలియని వ్యక్తి ఎంపీపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మరో 12 మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.