మానవహక్కులను కాలరాస్తున్న సిరియా : యూఎన్‌

శుక్రవారం, 24 ఫిబ్రవరి 2012 (11:18 IST)
హామ్స్ సిరీయాలో జరుగుతున్న అల్లర్లు, అక్కడ పెరుగుతున్న మృతులపై అంతర్జాతీయ దేశాల సమాఖ్య మండిపడింది. అక్కడ ప్రభుత్వం ఉత్తర్వులతో నే మానవ హక్కులు మంటగలసి పోతున్నాయని ఆరోపించింది. రోజు రోజు హింస పెట్రేగి పోతోందని అభిప్రాయపడింది.

సిరియాలో తాజా స్థితి తన కమిటీతో తెప్పించుకున్న 72 పేజీల నివేదికను జెనీవాలో బహిర్గతపరిచింది. అయితే నివేదిక తయారు చేసిన కమిటీ సభ్యుల పేర్లను బయట పెట్టడానికి నిరాకరించింది. అక్కడి సిరియా సైన్యం అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌కు విశ్వాసంగా పని చేస్తున్నాయని నివేదికలో పేర్కోన్నారు.

నివేదిక దాదాపు 369 మంది బాధితులను ప్రశ్నించిన మీదట తయారు చేశామని అందులో తెలిపారు. కానీ, సిరియా ప్రభుత్వం నుంచి కూడా ఫోటోలను వీడియో టేపులను తెప్పించుకున్నట్లు చెప్పారు. అయితే ఏవి కూడా యధాతథంగా తమకు చూపలేదని నివేదికలో పొందుపరిచారు.

హమ్స్‌ నగరం 20 రోజులుగా సైన్యం ఉక్కుపాదాల కింద నలిగిపోతోందని తెలిపారు. ఇక్కడ జరుగుతున్న మానహక్కుల ఉల్లంఘన మరెక్కడా లేదని నివేదిక చెపుతోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి ప్రపంచ దేశాల సహకారం అవసరమని ట్యునీషియా పౌరులు కోరుకుంటున్నారు.

అయితే హామ్స్‌ నగరం పరిస్థితి వర్ణణాతీతంగా ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసిన వందలాది కార్యకర్తలు యుద్ధట్యాంకుల కింద పడి నలిగిపోయారు. అధ్యక్షుడి రక్తదాహానికి, హింసకు హామ్స్‌ నగరం వేదికగా మారింది. ఇదిలావుండగా సిరియా పరిస్థితిని సమీక్షించేందుకు ప్రపంచదేశాలు ఏకమవుతున్నాయి.

ఇందులోభాగంగా కొన్ని యూరోపియన్‌, అరబ్‌ దేశాల విదేశాంగ శాఖ మంత్రులు గురువారం లండన్‌లో సమావేశమయ్యారు. క్షతగాత్రులకు కనీసం వైద్య సేవలు అందించడం, మానవ సహకారం అందించడానికి ముందుకు రావాలని అలాగే సిరియా అధ్యక్షుడిపై ఒత్తిడి తీసుకురావాలని చర్చించారు.

ఇదే అంశంపై అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్‌ మాట్లాడుతూ, దేశంలోకి సహాయ సహకారాలు అందించే యూఎన్‌‌ఓకు చేదువాదోడుగా ఉండడానికి చాలా దేశాలు ముందుకు వస్తున్నాయన్నారు. అయితే అక్కడకు వెళ్ళడం ఎలా అనేది పెద్దప్రశ్నగా ఉందని చెప్పారు.

సహాయ సహకారాలకు సిరియా ప్రభుత్వం అంతర్జాతీయ దేశాల ప్రతినిధులను అనుమతిస్తుందని టునీస్‌లో సమావేశమైన దేశాలు అభిప్రాయపడుతున్నాయి. కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారం చేసుకుని యూఎన్‌ తన అభిప్రాయాలను తెలిపింది. ఇప్పటి వరకూ జరిగింది ఒక ఎత్తయితే ఇక సిరియా ప్రభుత్వం కొత్త సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.

దేశంలో ఈ సంక్షభం ఇలాగే కొనసాగితే, పౌరుల మధ్య మతపరమైన, జాతి పరమైన ఘర్షణలు మొదలవుతాయని తెలిపింది. ఇవి చివరకు పరస్పరం పౌరులే ఒకరినొకరు చంపుకునే పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. ఇది చాలా ప్రమాదకరమన్న సంగతి గుర్తించాలని సిరియా ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

ఎటువంటి కారణం లేకుండా సాధారణ పౌరులను సైనికులునిర్భందిస్తున్నారని తెలిపారు. విచక్షణా రహితంగా పౌరు పరిసరాల్లోకి యుద్ధ ట్యాంకులను, మిషన్‌గన్లను అనుమతించారని కమిషన్‌ తెలిపింది. వీటి ద్వారా జరుగుతున్న కాల్పులతో భయానక పరిస్థితి అక్కడ నెలకొని ఉందన్నారు.

ఎటువంటి ఆయుధాలు లేకుండా నిరసనలు తెలుపుతున్న నిరసన కారులను కూడా సైన్యం కాల్చి చంపుతోందని తెలిపారు. ఇదిలా ఉండగా యూఎన్‌ఓ మాజీ అధ్యక్షుడు కోఫి అన్నన్‌ను సిరియాకు దూతగా పంపేందకు యూ ఎన్‌ ప్రయత్నాలు సాగిస్తోంది.

-- రచన : పుత్తా యర్రం రెడ్డి

వెబ్దునియా పై చదవండి