రైలు ఛార్జీలను పెంచబోం: రైల్వే మంత్రి లాలూ

శుక్రవారం, 6 జూన్ 2008 (11:32 IST)
దేశంలో పెరిగిన పెట్రో ధరల కారణంగా రైలు ఛార్జీలను పెంచబోమని కేంద్ర రైల్వేశాఖామంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరకుల ధరలు పెరిగిపోవడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు పెనుభారాన్ని మోస్తున్న విషయాన్ని తెల్సిందే.

ఈ నేపథ్యంలో మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఒక ప్రకనట విడుదల చేశారు. ప్రయాణికుల ఛార్జీలతో పాటు సరుకుల రవాణా ఛార్జీలను కూడా పెంచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. డీజిల్‌ ధరల పెంపుతో రైల్వేశాఖపై ఏటా రూ.681 కోట్ల అదనపు భారం పడుతుందని, అయినప్పటికీ ఇతర మార్గాల ద్వారా ఈ నష్టాన్ని భర్తీ చేసుకుంటామన్నారు.

ప్రస్తుతం ప్రతి ఏటా ఇంధనానికి రూ.ఎనిమిది వేల కోట్లను రైల్వే శాఖ ఖర్చు చేస్తోందని, తాజా పెంపు వల్ల అదనంగా మరో రూ.681 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. మరింత ఉత్పాదకత, సమర్థతతో పనిచేసి ధరల ప్రభావాన్ని అధిగమిస్తామని లాలూ ప్రకటించారు.

అలాగే రైల్వే లైన్ల విద్యుదీకరణ ద్వారా మరో రూ.150 కోట్ల నష్టాన్ని పూడ్చుకుంటామన్నారు. ఇదిలావుండగా.. సరుకుల రవాణా ఛార్జీలను తగ్గించే విషయమై ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా రైల్వే ఛార్జీలను పెంచకుండా రైలు బండిని విజయవంతంగా నడుపుతున్న ఘనత మన లాలూకే చెల్లింది.

వెబ్దునియా పై చదవండి